ములుగు, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : అద్దె చెల్లించడం లేదని బిల్డింగ్ ఓనర్ ఆగ్రహంతో సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల గేటుకు తాళం వేసిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. దసరా సెలవులు ముగిసిన అనంతరం గురుకులానికి చేరుకున్న విద్యార్థినులు, వెంట వచ్చిన వారి తల్లిదండ్రులు, గురుకులంలో పనిచేసే స్టాఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులానికి ప్రభుత్వం 12 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని తాళం వేశారు. గురుకుల స్టాఫ్‌తో పాటు విద్యార్థులు పడిగాపులుకాశారు. కొంత మంది విద్యార్థినులు తిరిగి ఇండ్లకు వెళ్లారు.
మూడు అంతస్తుల భవనాన్ని సంవత్సరం క్రితం నెలకు రూ.2.60 లక్షల చొప్పున ప్రతి నెలా చెల్లించేలా గురుకులానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 12 నెలలుగా అద్దె డబ్బులు రాకపోవడంతో సోమవారం గురుకుల గేటుకు యజమాని తాళం వేళాడు. ప్రిన్సిపాల్, స్టాఫ్ చేసేదేమీ లేక పక్కన కిరాణం షాపు వద్ద కూర్చుండిపోయారు. మధ్యాహ్నం ప్రిన్సిపాల్ కలెక్టర్ టీఎస్ దివాకరను సంప్రదించగా స్పందించిన ఆయన బిల్లింగ్ ఓనర్‌ను కలెక్టరేట్‌కు పిలిపించి రూ.4లక్షల చెక్కును ఇస్తానని హామీ ఇచ్చి మిగిలిన అద్దె డబ్బులను హైదరాబాద్‌లోని గురుకుల కార్యాలయానికి ప్రిన్సిపాల్‌తో వెళ్లి బిల్లులు చేయించుకోవాలని సూచించినట్టు సమాచారం.