హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల్లో మరోసారి బాలికలు రాణించారు. గత ఏడాదితో పోలిస్తే 90-95 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల శాతం కూడా పెరిగింది. సోమవారం సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలను విడుదల చేసింది. పదో తరగతిలో 93.60 శాతం (గత ఏడాది కంటే 0.48 శాతం ఎక్కువ), 12వ తరగతిలో 87.98 శాతం (గత ఏడాది కంటే 0.65 శాతం ఎక్కువ) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సామర్థ్య ఆధారిత ప్రశ్నల సంఖ్య పెంచడం వల్ల ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ ఏడాది విద్యార్థుల మెరిట్ లిస్ట్, వ్యక్తిగతంగా విద్యార్థులకు ఇచ్చే ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్లు ప్రకటించడం లేదని వెల్లడించారు. 12వ తరగతి ఫలితాల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారిలో 262 మంది విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగినవారని తెలిపారు. ప్రస్తుత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం జూలై 15న సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 10, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు 2025 ఫిబ్రవరి 15 నుంచి మొదలవుతాయని ప్రకటించారు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. 10, 12వ తరగతుల ఫలితాలను సీబీఎస్ఈ సోమవారం విడుదల చేసింది. 12వ తరగతి ఫలితాల్లో లక్షద్వీప్ 100 శాతంతో మొదటిస్థానంలో నిలువగా, 99.91 శాతంతో కేరళ రెండోస్థానంలో, 99.15 శాతంతో తెలంగాణ మూడోస్థానంలో నిలిచాయి. ఇక పదోతరగతి ఫలితాల్లో 99.79 ఉత్తీర్ణత శాతంతో కేరళ మొదటి స్థానంలో నిలువగా, 99.84 శాతంతో తమిళనాడు, 99.81 శాతంతో పుదుచ్చేరి, 99,66 శాతంతో ఏపీ, 99,55 శాతంతో తెలంగాణ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో తెలంగాణ నుంచి 8,337 మంది పరీక్షకు హాజరుకాగా, 8,266 మంది (99.15శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రం నుంచి 45,669 మంది హాజరు కాగా, వీరిలో 45,465 మంది (99.55శాతం) ఉత్తీర్ణులయ్యారు.