కొడిమ్యాల, నవంబర్ 26 : జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకున్నది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఉత్సవాల్లో తిప్పరవేణి నాగరాజు-మమత పెద్దకూతురు మధుశ్రీ (11) చెప్యాలలోని తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నది. బ్రహ్మోత్సవాలకు వచ్చిన మధుశ్రీ శోభాయాత్రలో నృత్యాలు చేసింది. గుట్టపైన కల్యాణం జరుగుతుండగా మెట్లమార్గంలో ఉన్న రెయిలింగ్ వద్ద స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా డెకరేషన్ కోసం అమర్చిన విద్యుత్తు తీగలు మెడకు తగలడంతో షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు జగిత్యాల దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆలయ కమిటీ నిరక్ష్యం, లైట్లు అమర్చిన వ్యక్తి భద్రతా చర్యలు పాటించలేదని బాలిక తండ్రి నాగరాజు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయం ఎదుట మధుశ్రీ మృతదేహంతో బుధవారం బంధువులు నిరసన తెలిపారు.