జిన్నారం, మార్చి 16: ఎయిర్‌గన్ మిస్‌ఫైర్ అయి నాలుగేండ్ల చిన్నారి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో చోటుచేసుకొన్నది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతెకు చెందిన నాగరాజు మూడునెలల క్రితం భార్య సుకన్య, కూతురు శాన్వీ (4), కొడుకు ప్రేమ్‌కుమార్(2)తో కలిసి ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఫామ్‌హౌస్‌లో పనిచేసేందుకు వచ్చా డు. నాగరాజు పనిచేసేందుకు వచ్చేటప్పటికే ఫామ్‌హౌస్‌లోని ఇంట్లో ఓ ఎయిర్‌గన్ ఉన్నది. మంగళవారం ఉదయం ఇంటిని శుభ్రంచేసే సమయంలో గోడకు ఉన్న ఎయిర్‌గన్‌ను తీసి సుకన్య కిందపెట్టింది. అక్కడే ఉన్న శాన్వీ, ప్రేమ్‌కుమార్ ఎయిర్గన్పై కూర్చుని ఆడుకొంటున్నారు. ఈ క్రమంలో ట్రిగ్గర్‌కు తగలడంతో గన్ పేలి, శాన్వీ తలకు తాకింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శాన్వీని తండ్రి నాగరాజు సూరారంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లాడు. అక్కడినుంచి ఉస్మానియా దవాఖానకు తరలించగా, చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.