హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): షరతులతో పత్తి కొనుగోలు టెండర్లలో పాల్గొనేందుకు జిన్నింగ్ మిల్లులు యాజమాన్యాలు అంగీకరించాయి. జిన్నింగ్ మిల్లుల డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించిన సీసీఐ.. మరికొన్ని అంశాలపై నవంబర్‌లో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు అంగీకరించాయి. సోమవారం ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సీసీఐ, జిన్నింగ్ మిల్లుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లలో సీసీఐ అమలుచేస్తున్న కొత్త నిబంధనల్లో జిన్నింగ్ మిల్లులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రతివారం సమీక్షించి వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీసీఐ అధికారులకు సూచించారు.
పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని జిన్నింగ్ మిల్లర్లను, సీసీఐ అధికారులను మంత్రి తుమ్మల కోరారు. చర్చల్లో భాగంగా మిల్లులకు పత్తి కేటాయింపులో ఎల్1, ఎల్2, ఎల్3 విధానాన్ని రద్దు చేసి అన్ని మిల్లులకు పత్తి ఇవ్వాలని జిన్నింగ్ మిల్లులు కోరాయి. మిల్లులకు పత్తి సరఫరాలో 15 కిలోమీటర్ల నిబంధనను ఎత్తేసి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై సీసీఐ అధికారులు సానుకూలంగా స్పందించినట్టు మిల్లర్లు తెలిపారు. అయితే, లింట్ పర్సంటేజీని మార్చడం కుదరదని సీసీఐ అధికారులు స్పష్టంచేసినట్టు తెలిసింది.
ఇలాంటి అభ్యంతరాలపై మరోసారి నవంబర్‌లో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఆలోపు రైతులకు ఇబ్బంది లేకుండా టెండర్లలో పాల్గొనాలని మిల్లర్లు నిర్ణయించారు. టెండర్లకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, సీసీఐ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్‌కుమార్ గుప్తా, కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్(ఫైబర్) పూర్ణేశ్ గురునాని, రాష్ట్ర కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రమేశ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.