హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులు తగ్గించుకొని, ఆ మొత్తాన్ని అనాథ, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువు కోసం రూ.50 లక్షలు విరాళంగా అందించిన బీఆర్ఎస్ సీనియర్ నేత అబ్దుల్ ముఖీత్ చాందాను ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అభినందించారు. హైదరాబాద్లో బుధవారం అబ్దుల్ ముఖీత్ చేసిన విరాళం సామాజిక బాధ్యతకు నిదర్శనం అంటూ ప్రశంసించారు. వివాహ శుభకార్యాల్లో జరిగే విపరీతమైన అలంకరణలు, ఇతర అనవసర ఖర్చులను తగ్గించుకొని, ఆ డబ్బును ‘గిఫ్ట్ ఎ స్మైల్’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం వెచ్చించాలని చాందా, ఆయన కుటుంబం నిర్ణయించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సర్ సయ్యద్ సొసైటీ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు మేలు కలుగుతుందని తెలిపారు. ‘గిఫ్ట్ ఎ స్మైల్’కు మద్దతుగా, సర్ సయ్యద్ సొసైటీ విజ్ఞప్తి మేరకు పలు విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులో 50శాతం రాయితీని ప్రకటించాయి.