హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ఒక అంశంపై విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమిస్తే ఏం చేయాలి.. తప్పులు ఎక్కడెక్కడ దొర్లాయో సాంకేతిక ఆధారాలు సేకరించాలి. ఎవరెవరు తప్పు చేశారో గుర్తించి, సహేతుకంగా నివేదికలో పొందుపరచాలి. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాత్రం ఈ మౌలిక సూత్రాలను ఏమాత్రం పట్టించుకోకుండా పక్కా రాజకీయ కమిషన్‌గా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన వివరాలను బట్టి చూస్తే మాజీ సీఎం కేసీఆర్‌ను బదనాం చేయాలనే లక్ష్యంతోనే నివేదిక రూపొందించినట్టు స్పష్టమవుతుంది. ఆధారాలను ప్రజల ముందు ఉంచాల్సిన కమిషన్.. తన పరిధిని దాటి పూర్తిగా రాజకీయ విమర్శలు చేసింది. తద్వారా రాజకీయంగా ఇరుకున పెట్టడంతోపాటు వ్యక్తిత్వ హననంపై దృష్టిసారించిందని తేటతెల్లం అయ్యింది. అందుకే ఈ నివేదికను ‘కాంగ్రెస్’ నివేదికగా చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు.
నివేదికలోని ప్రతి పేజీలోనూ కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, అమలు, నిర్వహణ.. ఇలా అన్ని అంశాల్లో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని కమిషన్ అభిప్రాయపడింది. అయితే.. ప్రాజెక్టు ప్లానింగ్ మొదలు పూర్తయ్యే వరకు ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరి నిర్ణయం వల్ల, ఎలాంటి తప్పులు జరిగాయో వివరించడం కమిషన్ బాధ్యత. కానీ అలా కాకుండా పేపర్ మీద డిజైన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యేదాకా మొత్తం కేసీఆర్‌నే బాధ్యుడిని చేయడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. మూడు బరాజ్‌లను నిర్మించాలని కేసీఆర్ ముందుగానే నిర్ణయించుకొన్నారని, దానినే అమలు చేశారని పీసీ ఘోష్ ఆరోపించారు. సాధారణంగా ఒక కార్యక్రమం ఎప్పుడైనా ఒకరిద్దరి ఆలోచనల్లో నుంచే పుడుతుంది. ఆ తర్వాతే దానిపై అధ్యయనం జరిపించి, ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంటారు. ఈ మేరకు అవసరమైన వ్యవస్థలను అందులో భాగస్వాములను చేస్తుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ జరిగింది అదే. ప్రాణహిత నదిని, గోదావరి నుంచి వచ్చే వరదను కలిపి లిఫ్ట్ చేయగలిగితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్ భావించారు. ఇదే ఆలోచనను సహచర మంత్రులు, ఇరిగేషన్ నిపుణుల అభిప్రాయాలు, వ్యాప్కోస్ వంటి జాతీయ సంస్థలతో అధ్యయనాలు.. నిర్వహించారు. అవన్నీ వదిలేసి కేసీఆర్ లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమిషన్ తన నివేదికలో ‘నాటి ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి కుట్రదారుగా (tacit perpetrator) వ్యవహరించారు’ అని పేర్కొన్నది. ఒక మంత్రి గురించి ఇంత కఠినమైన పదజాలం వాడవలసిన అవసరం ఏమొచ్చిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఫలానా మంత్రి చేసిన ఈ పనివల్ల జరిగిన పరిణామాలు ఇవి.. అని వివరించడం వరకు మాత్రమే కమిషన్ పని. కానీ ఆ పరిధులన్నింటినీ ఉల్లంఘించి మంత్రిని కుట్రదారుగా అభివర్ణిస్తూ, సొంత భాష్యం చెప్పడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా మాజీ సీఎం కేసీఆర్ మూడు బరాజ్‌లను కట్టాలన్న తన కోరికను తీర్చుకునేందుకు ఈ కుట్ర అమలుకు అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం తన సొంత కోరిక నెరవేర్చుకోవడం కోసం రూ.వేలాది కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నాటి ఆర్థిక మంత్రిపైనా కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక మంత్రికి అవగాహన లోపించిందని, నిబద్ధత, సమగ్రత లేదంటూ ఆరోపణలు చేసింది. దీనిపైనా నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చివరగా.. కమిషన్‌ను మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లపై విచారణ కోసం నియమించినట్టు నివేదికలో ప్రభుత్వమే పేర్కొన్నది. కానీ కమిషన్ తన నివేదికలో మొత్తం ప్రాజెక్టే వృథా అన్నట్టుగా వ్యాఖ్యానించింది. కేవలం మూడు బరాజ్‌ల్లో జరిగిన లోపాల గురించి మాట్లాడాల్సిందిపోయి, ‘ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాధనం దుర్వినియోగానికి పరాకాష్ఠగా మిగిలిపోయింది’ అంటూ వ్యాఖ్యానించడంపైనా మండిపడుతున్నారు.ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణపై కేసీఆర్ చేసిన సంతకం అని, దానిని చెరిపివేయలేరని స్పష్టం చేస్తున్నారు.
‘మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారు. బరాజ్‌లను రక్షించడానికి ఆయనకు నిజాయతీ, మనస్సాక్షి లేదు’ అంటూ కమిషన్ తన నివేదికలో నిందాపూర్వక వ్యాఖ్యలు చేసింది. ఇంతకన్నా దారుణమైన మాట మరొకటి ఉండదని, ఈ నివేదిక కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో తయారైందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ పట్ల, ప్రజల పట్ల కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధత గురించి రాష్ట్రంలో చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఎవరిని అడిగినా చెప్తారన్నారు. అలాంటిది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారన్న కమిషన్ మాటలను ఎవరూ నమ్మరని స్పష్టం చేస్తున్నారు. కమిషన్ న్యాయాధికారిగా వ్యవహరించి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాల్సిందిపోయి పూర్తి రాజకీయ దురద్దేశంతో వ్యవహరించినట్టు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.