హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ) : ట్యాంక్ బండ్‌పై ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పిడిపై కాంగ్రెస్ సర్కారు దాగుడు మూతలు ఆడుతున్నది. తెలంగాణ తల్లి పేరుతో ఫ్లైఓవర్‌కు చివరన రెండు వైపులా కొత్తగా భారీ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నది. సెక్రటేరియట్ వద్ద సోమవారమే కొత్త బోర్డును ప్రారంభించారు. దీనిపై నగరవాసులతోపాటు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోకుండా రెండు వైపులా భారీ బోర్డులను ఏర్పాటు చేసే పనులు కొనసాగిస్తున్నది. తాజాగా సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన కమాన్‌పై తెల్లటి వస్త్రం కప్పేశారు. ప్రారంభించిన ఒక్క రోజులోనే బోర్డును కప్పేయడంపై విమర్శలొస్తున్నాయి.
బోర్డుపై తెల్లటి వస్త్రం కప్పడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల మనోభావాలు దెబ్బతీయకూడదనే ప్రభుత్వం ఫ్లైఓవర్ పేరు మార్పును తాత్కాలికంగా వా యిదా వేసిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై బల్దియా వివరణ ఇచ్చింది. రెండో వైపున మరో సైన్ బోర్డు నిర్మాణంలో ఉందనీ, అది పూర్తికాగానే బోర్డుపై ఉన్న తెల్ల వస్ర్తాన్ని తొలగిస్తామని పేర్కొంది.