CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : మైకు దొరికిన ప్రతిచోటా ‘రాజీవ్ గాంధీ’ జపం చేస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగానే ఆయనంటే ఎంత అభిమానమో! అని అంతా అనుకున్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ విగ్రహాన్ని పెడితే కాంగ్రెస్‌కు, ‘గాం ధీ’ కుటుంబానికి రేవంత్ వీరభక్తుడని, రాజీవ్‌గాంధీనే అనుసరిస్తాడని భావించారు. కానీ ఇదంతా రా జకీయ లబ్ధికోసం చేసిన బూటకమేనని తేలిపోయిం ది. తన మానస పుత్రిక ‘హైడ్రా’ కోసం జీహెచ్ఎంసీ అధికారాలను బదలాయిస్తూ ప్రభుత్వం గెజిట్ తీసుకురావడంతో నిజమైన కాంగ్రెస్‌వాదులకు ఇన్నాళ్లూ కమ్ముకున్న పొరలు తొలిగిపోయాయి. నాడు స్థానిక సంస్థల బలోపేతానికి రాజీవ్‌గాంధీ పునాదులు వేస్తే.. నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఆ పునాదులను పెకలించేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో జీహెచ్ఎంసీకి, దాని కమిషనర్‌కు ఉన్న అధికారాలను ఇత ర ఏజెన్సీ లేదా అధికారికి బదలాయించే అధికారా న్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టారు. తద్వారా జీహెచ్ఎంసీ కోరలు పీకేసి, ప్రత్యామ్నాయ వ్యవస్థను తెచ్చారని రాజ్యాంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
నాడు రాజీవ్ తపన..
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను బలోపేతం చేసేందుకు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారు. సింఘ్వీ కమిటీ లాంటి నిపుణుల బృందాలను నియమించి కార్యాచరణ రూపొందించారు. పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి ప్రణాళిక రూపొందించి, పూర్తిస్థాయిలో నియమ నిబంధనలతో బిల్లును తయారుచేశారు. 65వ రాజ్యాంగ సవరణ రూపంలో 1989లో లోక్‌సభలో బిల్లు పాస్ అయినా రాజ్యసభలో ఆగిపోయింది. రాజీవ్‌గాంధీ మరణానంతరం దివంగత ప్రధాని పీవీ హయాంలో 1993లో 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఆమోదం పొందింది. పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి గట్టి పునాది పడింది. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణ స్థానిక సంస్థల రూపురేఖలు, పాలనా వ్యవహారాలు వంటివి నిర్ణయమయ్యాయి.
మూడు దశాబ్దాల స్వేచ్ఛకు మంగళం
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని మూడు దశాబ్దాల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ స్థానిక సంస్థలకు రాజీవ్ గాంధీ ఊపిరిపోస్తే తాజా గెజిట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చావుదెబ్బ కొట్టాడని రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు. పరిరక్షణ పేరుతో రోడ్లు, వీధులు, జలవనరులు తదితర ప్రభుత్వ ఆస్తులపై అజమాయిషీని ఏజెన్సీకి కట్టబెట్టారని, కేవలం తన రాజకీయ స్వార్థం కోసం పుట్టించిన ‘హైడ్రా’ కోసం జీహెచ్ఎంసీని బలి పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.