GHMC | మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 19: అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపులో భాగంగా పేదోళ్ల వ్యాపార సముదాయ నిర్మాణాలను ఆగమేఘాల మీద కూల్చేసిన అధికారులు, ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్‌కు చెందిన అక్రమ నిర్మాణాలను వదిలేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఏ లాభాపేక్షతో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలను వదిలేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేకో న్యాయం.. పేదోడికో న్యాయమా? అని చిరువ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పేదలు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, దుర్గానగర్చౌరస్తా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా చిన్నచిన్న వ్యాపారాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. కనీసం ఒక్కరోజు సమయం ఇవ్వకుండానే పేదల వ్యాపార సముదాయాలను పూర్తిగా నేలమట్టం చేశారు.
అయితే, అధికార పార్టీ ఎమ్మె ల్యే టీ ప్రకాశ్‌గౌడ్ తన నివాసాన్ని దుర్గానగర్చౌరస్తాలో రోడ్డు సగానికి ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఆయన వ్యాపార కేంద్రాలు మొత్తం రోడ్డును ఆక్రమించుకుని కొనసాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతున్నది. అయినప్పటికీ, జీహెచ్ఎంసీ అధికారులు ఎమ్మెల్యేకు సంబంధించిన ఆక్రమణల జోలికి వెళ్లకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
దుర్గానగర్చౌరస్తా-లక్ష్మీగూడ-వాంబేకాలనీ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కొందరు తమ స్థలాలను మించి ముందుకొచ్చి రోడ్డుపైనే నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. లక్ష్మీగూడ, వాంబేకాలనీ మీదుగా ప్రయాణించే వాహనాదారులు ఈ దారి గుండా వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పేద ప్రజలతోపాటు అధికార పార్టీకి చెందిన బడా నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ ఇష్టానుసారంగా రోడ్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు. వీరిని ప్రశ్నించే అధికారులు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తమ అక్రమ నిర్మాణాల జోలికి రాకుండా అధికారులపై ఒత్తిడి ప్రయోగిస్తున్నారు.