హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 3 (నమస్తే తెలంగాణ): గత శాసనసభ ఎన్నికల సందర్భంగా పనిచేసిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ సత్తా చాటుతామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కొందరు ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. బిల్లుల చెల్లింపులో సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్లు (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.
అధికారుల వైఖరికి నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి తమ కాంట్రాక్టర్లు చేయవలసిన పనులన్నీ బహిష్కరించాలని నిర్ణయించినట్టు కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా 15 నియోజకవర్గాల పరిధిలో 273 మంది పనిచేశారని తెలిపారు. పోలింగ్ బూత్లు, డీఆర్సీ సెంటర్, స్ట్రాంగ్ రూంలు, ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్స్, ఫుడ్, లేబర్ సఫ్లయ్, ట్రాన్స్పోర్టేషన్, టెంట్ సామగ్రి, టేబుల్స్, కుర్చీలు వంటి ఎన్నికల సంబంధిత పనులు చేసినట్టు కాంట్రాక్టర్ సాయి వివరించారు. 2023 డిసెంబర్లోనే కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులకు బిల్లులను సమర్పించారని, కానీ అధికారులు వాటిని తొక్కిపెట్టారని ఆరోపించారు.