హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్(టీఎస్ జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ నేతలు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించింది. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజగంగారెడ్డి, గిరిధర్‌గౌడ్, కోశాధికారి తుకారాం పాల్గొన్నారు.
కొత్తగా బీఏ తెలుగు ఆనర్స్ ; వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బీఏ తెలుగు ఆనర్స్ డిగ్రీ కోర్సును తీసుకురావాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ సహా మరికొన్ని అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. తెలుగులో సివిల్స్ రాసే అభ్యర్థుల కోసం ఈ కోర్సును డిజైన్ చేస్తున్నారు. సివిల్స్‌లో ఉండే సబ్జెక్టులు, పాఠ్యాంశాలే ఇందులో ఉండనున్నాయి. ఇటీవలికాలంలో ఆంత్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సివిల్స్‌లో ఎంతోమంది విజయం సాధిస్తున్నారు. కొన్ని రాష్ర్టాల విద్యార్థులు ప్రాంతీయ భాషలను ఎంచుకొని సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఆప్షన్‌తో సివిల్స్ రాసే వారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం తెలిపారు.