హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి మహిళా గజల్ రచయిత్రి బైరి ఇందిర పేరిట పురస్కారాలు ప్రదానం చేయడం ఆనందంగా ఉన్నదని ప్రముఖ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వరవల్లరి తెలుగు గజల్ అకాడమీ ఆధ్వర్యంలో ‘బైరి ఇందిర రమణమ్మ గజల్’ పురస్కార ప్రదానం రవీంద్రభారతిలో జరిగింది. ప్రముఖ కవి, గజల్ పండితుడు డాక్టర్ పెన్నా శివరామకృష్ణ, గజల్ గాయకురాలు కొత్తకాపు స్వరూపారాణికి బైరి ఇందిర పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ ఇటువంటి పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని చెప్పారు. భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పత్తిపాక మోహన్ మాట్లాడుతూ తల్లి పేరును చిరస్థాయిగా నిలిపేలా హిమజారామం కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో గజల్ కవయిత్రి గడ్డం శ్యామల, తెలంగాణ జాగృతి కార్యదర్శి రంగు నవీనా చారి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజిదా ఖాన్, నిభానపూడి శ్రీవాణి, పలువురు కవులు, గాయకులు పాల్గొన్నారు.