హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని, సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సోమవారం ఆయన హాకా భవన్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది పత్తి కొనుగోళ్ల కోసం 121 వ్యవసాయ మారెట్ యార్డుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, తేమను కొలిచే యంత్రాలను ఏర్పాటు చేయడంతోపాటు కొనుగోళ్లకు అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని మారెటింగ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రం వారానికి ఆరు రోజులు పనిచేసేలా సీసీఐ మేనేజర్లు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
పత్తి కొనుగోలు ప్రక్రియలో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సంపూర్ణంగా భాగస్వాములు కావాలని సూచించారు. 313 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించినట్టు తెలిపారు. కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని, పత్తి నాణ్యతను పరీక్షించేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రయోగశాల నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి సూచించడంతో సీసీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. సీసీఐ టెండర్లలో పాల్గొనేందుకు జిన్నింగ్ మిల్లర్లు సానుకూలత వ్యక్తం చేశారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్తికి డిమాండ్ ఏర్పడినందున ఈసారి మంచి ధర లభించే అవకాశం ఉన్నదని, ప్రస్తుతం మారెట్లో క్వింటాలు పత్తి ధర సుమారు రూ.8 వేల వరకు ఉన్నదని చెప్పారు. అయినప్పటికీ రైతులకు రూ.6,380కు పైగా మద్ధతు ధర లభించేలా మారెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో మారెటింగ్ శాఖ అదనపు సంచాలకులు లక్ష్మణుడు, రవికుమార్, సీసీఐ జనరల్ మేనేజర్ అమర్నాథ్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ మల్లేశం, బ్రాంచ్ మేనేజర్లు బ్రిజేశ్ కుమార్, మహేశ్వర్‌రెడ్డి, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.