జహీరాబాద్, జూన్ 14 : సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారులో అరుదైన ఖనిజనిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ భూముల్లో వెనేడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలు ఉన్నట్టు సంబంధిత అధికారులు, నిఫుణులు గుర్తించారు. ఈ ఖనిఖ నిక్షేపాలు ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలతో పాటు ఇంధన నిల్వలకు ఎంతగానో దోహదపడుతాయని చెప్పారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలమేరకు ఈ ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సంబంధిత శాఖాధికారులు, నిఫుణులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించారు. సర్వే నంబర్ 5 నుంచి 48 వరకు ఉన్న 800 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ, పట్టా భూముల్లో ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సర్వే చేపట్టారు.
ఈ భూముల్లో 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో 15.25 మిలియన్ టన్నుల వెనేడియం, 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్, టైటానియం నిక్షేపాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. జహీరాబాద్ పట్టణానికి అతి సమీపంలో పర్వతాపూర్ బ్లాక్ ఉండటం.. రవాణా, రోడ్డు, రైలు మర్గాలు దగ్గరగా ఉండడంతో పెట్టుబడిదారులకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని కేంద్రం భావించింది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖనిజ నిక్షేపాలను వెలికితీయడంతో పాటు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రోడ్‌షో నిర్వహించారు. ఈ నెల 11న గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన గనుల వేలం పాటలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రాధాన్య బిడ్డర్‌గా పాల్గొని గనులను దక్కించుకుంది.
అరుదైన ఖనిజ నిక్షేపాలు.. పలు రంగాల్లో కీలక పాత్ర..
పర్వతాపూర్ శివారులో లభించే అరుదైన ఖనిజ నిక్షేపాలు పలు రంగాల్లో కీలక పాత్ర పోషించనున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. వెనేడియం స్టీల్ తయారీలో, ఉక్కు బలాన్ని పెంచేందుకు, బ్యాటరీల తయారీలో ఎంతగా దోహదపడనుందన్నారు. అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలు డిఫెన్స్ రంగం, ఎయిర్‌క్రాఫ్ట్, మిలటరీ ఆయుధాలు, రాకెట్ల తయారీలో ఉపయోగిస్తారని చెప్పారు. జహీరాబాద్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాపూర్ నిక్షేపాల బ్లాక్‌కు జాతీయ రహదారి 65, రైల్వే మార్గం ఉండటం పెట్టుబడిదారులకు కలిసి రానుంది. ఇప్పటికే హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్, ఝరాసంగం మండల పరిధిలోని నిమ్జ్ ప్రాజెక్టు, ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుతో జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. ఖనిజ నిక్షేపాల వెలికితీత, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రియల్ ఎస్టేట్ పరంగానూ అభివృద్ధి చెందనుంది. ఖనిజ నిక్షేపాలు, నిమ్జ్ ప్రాజెక్టు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.