Hyderabad Lakka Gajulu | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని లాడ్‌బజార్ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్స్ ట్యాగ్) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధీనంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ శాఖ శనివారం లక్క గాజులకు భౌగోళిక గుర్తింపును మంజూరు చేసింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి భౌగోళిక గుర్తింపు లభించినవాటిలో ఇది 17వ వస్తువు. చార్మినార్‌లోని లాడ్‌బజార్ లక్కగాజులకు ప్రఖ్యాతిగాంచిన విషయం విదితమే. లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు కోసం క్రిసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్, 2022లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దరఖాస్తు చేసుకున్నట్టు జీఐ ప్రతినిధి సుభజీత్ సాహా తెలిపారు.
త్వరలోనే దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేస్తారని పేర్కొన్నారు. లక్క గాజుల కోసం ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నట్టు తెలిపారు. జీఐ గుర్తింపుతో తమ హస్తకళలకు మరింత గౌరవం లభించిందని అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ హిసాముద్దీన్ పేర్కొన్నారు.