ఖైరతాబాద్, జూలై 28 : గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను మల్టీజోన్ నుంచి స్థానిక జోన్‌గా సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల గ్రేడ్-2 సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజగంగారెడ్డి, గిరిధర్‌గౌడ్, ప్రసూన మాట్లాడుతూ 2023 సెప్టెంబర్‌లో 999 మంది ప్రధానోపాధ్యాయులుగా మల్టీజోన్-1లో పదోన్నతి పొందినట్టు చెప్పారు.
వారు తమ సొంత జిల్లాలకు దూరంగా 100 కిలోమీటర్లకు పైగా దూరంలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం గెజిటెడ్ హెచ్ఎం పోస్టులను మల్టీజోన్ నుంచి జిల్లా లేదా, జోన్స్థాయికి మార్చాలని.. మల్టీజోన్ పరిధిలో పదోన్నతి పొందిన వారికి సంవత్సరం సర్వీస్ నిబంధనతో బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. విద్యాశాఖ సీఎం వద్దే ఉండడంతో తమ బాధలు ఆయనకు చేరడం లేదని, మంత్రులు, ఉన్నతాధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.