Gayatri | జూలపల్లి, నవంబర్ 30: హమాలీ బిడ్డ ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ఆర్థిక ఇబ్బందులు అధిగమించి, కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు అనిల్, అభిషేక్, కూతురు గాయత్రీ ఉన్నారు. మొండయ్య హమాలీ పనులతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రీ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి, పెద్దపల్లిలోని ట్రినిటీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. లా చేయాలన్న ధృడసంకల్పంతో వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో సీటు దక్కించుకుని ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ లా కామన్ ఎంట్రెన్స్ రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం విద్యనభ్యసించారు. అనంతరం ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన న్యాయ సంబంధిత సివిల్ జడ్జి విభాగం పోటీ పరీక్షలు రాయగా.. నవంబర్ 27న విడుదలైన ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు. ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా గాయత్రీ ఎంపిక కావడంతో గ్రామస్థులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
యువ న్యాయవాదులను ఆదుకోండి: వెంకన్న
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడానికి యువ లాయర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకన్న కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు యువ లాయర్లకు ఐదేండ్ల వరకు రూ.20 వేల ఉపకారవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉపకార వేతనాలు అందిస్తున్నాయని.. అదే తరహాలో తెలంగాణలోనూ అందించి ఆదుకోవాలని కోరారు. అడ్వకేట్లకు జీరో ప్రీమియంతో జీవిత బీమా కల్పించాలని అన్నారు.