హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కొన్ని నెలల్లోనే గౌతమ్ అదానీ ఆదాయం భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాత గౌతమ్ అదానీ ప్రపంచంలో మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ నికర విలువ రూ.10.9 లక్షల కోట్లకు చేరింది.
ఫిబ్రవరి 2022లో అతని నికర విలువ రూ.6.6 లక్షల కోట్లు మాత్రమే. ఈ మధ్య కాలంలోనే రూ.4.3 లక్షల కోట్లు పెరిగింది. ఇలాంటప్పుడు భారతదేశం వృద్ధి చెందడం లేదని ఎవరు చెప్పారు అని ప్రొఫెసర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ ట్వీట్‌చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ప్రతి పేద భారతీయుడికి మోదీ ఇస్తానని చెప్పిన రూ.15 లక్షలు మొత్తం ఒకే ఖాతాలో జమ చేశారనుకుంటున్నా. పొరపాటుగా జరిగిందా మోదీ జీ..?’ అని ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌చేశారు.