హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ గౌతమ్‌రావును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాకర్ పదవీకాలం మే 1న ముగియనున్నది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. గౌతమ్‌రావు గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.
81 మంది కార్పొరేటర్లు, 35 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు సహా మొత్తం 116 మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావును ప్రకటించడంపై ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పార్లమెంట్ నియోజకవర్గానికే పోస్టులు ఇస్తారా?. మీకు గులాంగిరి చేసే వారికి మాత్రమే పోస్టులు, టికెట్లు కేటాయిస్తున్నారు’ అని పరోక్షంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.