ములుగు రూరల్, నవంబర్ 24 : ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని ఆది దేవత గట్టమ్మ తల్లి పురాతన మూలాన్ని ఆదివారం సమ్మక్క-సారక్క సెంట్రల్ ఆర్కియాలజీ బృందం పరిశోధకులు, గట్టమ్మ పూజారులు గుర్తించారు. ఈ సందర్భంగా గట్టమ్మ పూజారి కొత్త సురేందర్ మాట్లాడుతూ.. ఆదివారం పలు గిరిజన యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు గట్టమ్మ పరిసరాల్లో పరిశోధనలు చేయగా గట్టమ్మ చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు తెలిపారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కొండగుహల్లో ఉన్నట్టు పరిశోధన బృందం గుర్తించినట్టు పేర్కొన్నారు. కొత్త అనే ఇంటి పేరు కలిగిన వంశీయులు జాతర నిర్వహణ కొండ ప్రాంతంలో నడిపారని అన్నారు. వెతుకులాటలో పురాతన కాలం నాటి శిలాశాసనం లభ్యమైందని చెప్పారు. ఆచార వ్యవహారాలకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు లభ్యమైనట్టు పూజారి పేర్కొన్నారు.