House Tax | నల్లగొండ సిటీ, మార్చి 25 : నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలో మున్సిపాలిటీ అధికారులు ఓ కుటుంబంపై దౌర్జన్యానికి దిగారు. ఇంటి పన్ను కట్టలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గేటు ఎత్తుకెళ్లారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రాల అంజయ్య నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా పొలం కౌలుకు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేండ్లపాటు ఇంటిపన్ను సక్రమంగా కట్టినా.. ఇటీవల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పన్ను కట్టడం ఆలస్యమైంది. దాదాపు రూ.20 వేలు బకాయి ఉన్నది. మంగళవారం మున్సిపల్ అధికారులు అంజయ్య ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆయన భార్య భాగ్యమ్మ ఇంట్లో ఉంది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే పన్ను బకాయి ఉందంటూ గేటు తీసుకెళ్లారు. డబ్బులు కట్టేందుకు గడువు కావాలని కోరినా విన్పించుకోలేదు. ఇది పద్ధతి కాదని పక్క ఇంటి వారు అనడంతో వారిని కూడా బెదిరించారు. ‘మీది కూడా బిల్లు తక్కువ వస్తుంది.. రివైజ్ చేసి బిల్లు ఎక్కువ బిల్లు వచ్చేలా చేస్తాం’ అంటూ బెదిరించారు.
మా ఇంటాయన వచ్చే దాక ఆగలేదు
అధికారులు మా ఇంటి గేటు ఎత్తుకెళ్లి పరువు తీసిండ్రు. పన్ను కట్టేందుకు సమయం కావాలన్నా వినిపించుకోలేదు. ఆ టైములో మా ఇంటి ఆయన లేడు. వచ్చే వరకు ఆగమన్నా ఆగకుండా గేటు తీసుకుపోయిండ్రు. గతంలో ఇంత దౌర్జన్యం ఎప్పుడూ లేదు.
-భాగ్యమ్మ, బాధితురాలు