హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కొత్తగా తెలంగాణ రాజ్య సమితి అనే పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో రిజిస్టర్డ్ గుర్తింపులేని రాజకీయ పార్టీ అయిన తెలంగాణ రాజ్య సమితి.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తామని, అందుకు కామన్ సింబల్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నది. దీనిని ఎన్నికల కమిషన్ పరిశీలించి, గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని, ఈ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్ సిలిండర్ గుర్తునే కేటాయించాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కనీసం 5% సీట్లలో సదరు పార్టీ పోటీ చేయాల్సి ఉంటుందని, అలా చేయకపోతే ఒకే గుర్తును కేటాయించనవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. సదరు పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఇతరులకు కేటాయించవచ్చని కూడా స్పష్టంగా పేర్కొన్నది.