చేగుంట, జనవరి 25: గ్యాస్ సిలిండర్ పేలి నాయనమ్మ, మనుమరాలు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్నశివునూర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల అంజమ్మ (59)కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 24న అంజమ్మ రేషన్ బియ్యం, పెన్షన్ కోసం తన మనుమరాలైన మధు(6)ను తీసుకొని చిన్నశివునూర్కు వచ్చింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో అంజమ్మ, మధు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు గ్రామానికి చేరుకొని బోరున విలపించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేశారు.