హైదరాబాద్, తెలుగు యూనివర్సిటీ, మార్చి 9: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు, సంగీత స్వరకర్త, శాస్త్రీయ సంగీత గాయకుడు, కళారత్న గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుమలలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వెయ్యికిపైగా అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెళ్ల.. ప్రముఖ సంగీత విద్యాంసుడిగా పేరొందారు. ఆయన స్వరకల్పన చేసిన ‘వినరోభాగ్యము విష్ణుకథ’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు’, ‘జగడపు చనువుల జాజర’.. తదితర సంకీర్తనలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. వచ్చెను అలిమేలు మంగ, తిరువీధుల మెరసీ దేవదేవుడు, చూడరమ్మ సతులారా, జయలక్ష్మి వరలక్ష్మి, ఆదిమూలమే మాకు అంగరక్ష, అంతయు నీవే హరి, ఏమని పొగడుదుమే తదితర కీర్తనలు కూడా ఆయన స్వరపరిచినవే. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు. టీటీడీ ఆస్థాన విద్యాంసుడుగా, కంచి కామకోటి పీఠం, అహోబిల మఠం ఆస్థాన సంగీత విద్వాంసుడుగా సేవలు అందించారు. గత శుక్రవారం నాడే ఆయన యాదగిరిగుట్టలో తన ప్రదర్శనతో ఆహుతులను అలరించారు. ఇంతలోనే ఆయన మరణ వార్త తెలియడంతో సంగీతప్రియులు విచారం వ్యక్తంచేస్తున్నారు.
శ్రీవారి సేవకే జీవితం అంకితం
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వాస్తవ్యుడైన గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ తిరుపతిలో స్థిరపడి అన్నమయ్య అంశగా ప్రశంసలు అందుకున్నారు. 197౮లో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్ట్‌లో గాయకుడిగా చేరిన గరిమెళ్ల 2006లో ఉద్యోగ విరమణ పొందారు. అన్నమయ్య కీర్తనలను ఆలపించడం, స్వరపరచడం, రికార్డు చేయడం, పుస్తకాలు ప్రచురించడం ద్వారా తన జీవితాన్ని తిరుమల శ్రీవారి సేవకే అంకింత చేసుకున్న మహనీయుడు గరిమెళ్ల. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం సైతం లభించింది. విద్వత్తు ఉన్నా, శిఖరమంత ప్రతిభ పుక్కిట పట్టినా ఎంతో వినమ్రత గల వ్యక్తిగా, మానవీయ హృదయం ఉన్న సంగీత విద్యాంసుడిగా పేరొందారు. మహామహులు ఎందరో శాస్త్రీయ కచేరీలు చేసినా తెలుగునాట సంకీర్తన యజ్ఞ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మాత్రం గరిమెళ్లకే దక్కుతుంది. భక్తి టీవీ హరి సంకీర్తన ద్వారా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. ఆరువేలకుపైగా కచేరీలు చేశారు. 300 కీర్తనలు నాన్‌స్టాప్‌గా పాడిన ఘనత సాధించారు. సిలికానాంధ్ర సంస్థ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన లక్ష గళార్చనలో ప్రధాన గాయకుడిగా మెప్పించారు.
ఆ కార్యక్రమం గిన్నిస్‌బుక్ వరల్డ్రికార్డులో చోటుదక్కించుకోవడం విశేషం. ఆయన భక్తి గీతాలు రచించడంలోనూ దిట్ట. స్వయంగా హనుమాన్ భక్తుడైన ఆయన 21 ఆంజనేయ కృతులు రచించి స్వరపరచారు. వినాయకుడిపై 50 కృతులు రచించారు. వెయ్యికిపైగా కీర్తనలు రచించి, స్వరపరచి జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. ఆయన స్వరపరచిన సంకీర్తనలను అనేక పుస్తకాలుగా టీటీడీ ప్రచురించింది. ఆయనకు భార్య రాధ, కుమారులు పవన్‌కుమార్, అనిల్‌కుమార్ కూడా శ్రీవేంకటేశ్వరస్వామికి అంకితమై సేవలు అందిస్తున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తికి శిష్యుడు, ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకికి మేనల్లుడు కావడం మరో విశేషం. సినిమా అవకాశాలు వచ్చినా శాస్త్రీయ సంగీతానికి, స్వామి వారి సేవకు అంకితమై జీవించారు. గరిమెళ్ల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.