కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 5 : బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య అంత్యక్రియలు గురువారం కరీంనగర్లో ముగిశాయి. స్థానిక మార్కండేయ నగర్‌లోని స్వర్గధామంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గంగుల నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని సం దర్శించారు.
పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు గంగుల కమలాకర్‌ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియలకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌రెడ్డి, కూరపాటి రఘోత్తంరెడ్డి, ఎల్ రమణ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్, జడ్పీ చైర్పర్సన్లు విజయ, పుట్ట మధు తదితరులు హాజరయ్యారు.