కలెక్టరేట్, ఆగస్టు 18: అణగారిన వర్గాలకు కేరాఫ్ అయిన నేతన్నల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. కేంద్రం మోకాలడ్డుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. శుక్రవారం జాతీయ చేనేత వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత రంగం చితికి పోయిందని, దానిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే.. కేంద్రం జాతీయ హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసి ఎగుమతులపై పెద్ద దెబ్బ కొట్టిందని ధ్వజమెత్తారు. కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకోవాల్సిన కేంద్రం.. కార్మికుల పొట్టగొట్టి.. బడా వ్యాపారులైన అదానీ, అంబానీలకు ప్రోత్సాహకాలిస్తున్నదని మండిపడ్డారు. ప్రతి వెనుకబడిన కులానికి కోట్లాది రూపాయల విలువ చేసే ప్రాంతంలో స్థలం ఇచ్చి, భవన నిర్మాణాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. పద్మశాలి భవన్ నిర్మాణం కోసం ఎకరాకు వంద కోట్ల ధర పలుకుతున్న కోకాపేటలో రెండెకరాల భూమి ఇచ్చి వారిలో ఆత్మగౌరవం నింపారని కొనియాడారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మాభిమానంతో జీవిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన ప్రజలు సగర్వంగా తలెత్తుకుని బతుకుతున్నారని చెప్పారు. వారికి మరింత ఆర్థిక చేయూతనిచ్చే క్రమంలో ప్రతి మగ్గానికి రూ.3 వేలు అందించేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.