కరీంనగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా కాంగ్రెస్ను వదలబోమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చాక మోసగించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయించిన కులగణన సర్వే అసమగ్రంగా, అశాస్త్రీయంగా, కాకిలెక్కలుగా ఉందని మండిపడ్డారు. బీసీ కమిషన్, క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదించిన జీవో నంబర్ 26ను కాదనడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు.
ఈ జీవోను తొక్కిపెట్టి ప్లానింగ్ విభాగం ద్వారా కులగణనకు జీవో 18ని విడుదల చేసి మొత్తం వ్యవస్థనే పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. గతంలోనే కేసీఆర్ సర్కారు బీసీల ఆర్థిక సామాజికస్థితిగతులను అధ్యయనం చేయడానికి 2021లోనే జీవోనంబర్9 ద్వారా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ఈ కమిషన్ నివేదిక ఆలస్యమైందని తెలిపారు. 2024 జనవరి 29న ఈ కమిషన్ నివేదిక అందించినట్టు చెప్పారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కులగణన చేపట్టకుండా ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. జీవో నంబర్ 18 ద్వారా చేసిన సర్వే న్యాయస్థానాల్లో నిలువదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేసిన కులగణనలో రాష్ట్రంలో 3.70కోట్ల మంది జనాభా మాత్రమే ఉన్నట్టు చెబుతున్నారని, 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే రాష్ట్ర జనాభా మూడున్నర కోట్ల పై చిలుకు ఉందని గంగుల గుర్తు చేశారు. ప్రతి పదేళ్లకు తెలంగాణలో 13.8శాతం రేషియో చొప్పున జనాభా పెరుగుతుందని కేంద్రం 2011జనాభా లెక్కల సమయంలో తేల్చి చెప్పిందని తెలిపారు. ఆ లెక్కన చూస్తే రాష్ట్ర జనాభా 4.20కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. దీనిని చూస్తే ప్రభుత్వం చేసిన సర్వే తప్పులతడక కాక.. మరేంటో చెప్పాలని ప్రశ్నించారు.
మరోసారి రీ సర్వే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే, మిగిలిపోయిన కుటుంబాలకు మాత్రమే సర్వే చేస్తామని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందని గంగుల అన్నారు. ఇలా అయితే ఇప్పటివరకు చేసిన సర్వే వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే వివరాలు ప్రజలు చూసుకునే వీలుంటుందని చెప్పారు. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 56 నుంచి 66 శాతం ఉన్న బీసీ జనాభాను 46.25శాతానికి తగ్గించడం వెనుక బీసీలపై కాంగ్రెస్కు ఉన్న వివక్షను తెలియజేస్తున్నదని విమర్శించారు. మరోసారి శాస్త్రీయంగా కులగణను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.