హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ)అప్పిలెట్ బోర్డు మెంబర్‌గా ప్రొఫెసర్ టీ గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్ఎంసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గంగాధర్ ప్రస్తుతం నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అప్పీల్ కమిటీ చైర్మన్‌గా ఎన్ఎంసీ చైర్మన్ అభిజత్ చంద్రకాంత్ సేత్ వ్యవహిరించనున్నారు. మొత్తం ముగ్గురు సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటుచేయగా, ఢిల్లీ ఎయిమ్స్‌లో మెడికల్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ కే శర్మ మరో సభ్యుడిగా నియమితులయ్యారు.
ఎన్ఎల్యూల్లో ఓబీసీ కోటా అమలుచేయాలి ;ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్ఎల్యూ)ల్లో 27 శాతం ఓబీసీ కోటా అమలుచేయాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఏఐఓబీసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, కన్వీనర్ అడ్వకేట్ పంకంజ్సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్‌కుమార్ మిశ్రాను కలిశారు. నేషనల్ లా కాలేజీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలుచేయాలని వినతిపత్రం అందజేశారు. బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని, లేకుంటే పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.