హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ): మెడికల్, బిజినెస్ వీసాలపై వచ్చి వీసా, పాస్‌పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ సైప్లె చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, సిటీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. బుధవారం సీసీఎస్‌లో నార్కోటిక్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేసి నైజీరియాకు చెందిన ఒలివర్ అలియాస్ జాన్సన్ అలియాస్ జాన్, సిల్వెస్టర్, గనాకు చెందిన రోమియోను అదుపులోకి తీసుకున్నారు.
2009లో జాన్సన్ అలియాస్ జాన్ బిజినెస్ వీసాపై దేశానికి రాగా, 2013లో అతని వీసా ముగిసింది. 2013లో ఢిల్లీ పోలీసులు ఒక కేసులో జాన్‌ను అరెస్ట్ చేయడంతో ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. వీసా గడువు ముగిసినా జాన్ ఇక్కడే ఉంటూ ఢిల్లీ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ ముగ్గురు నైజీరియన్స్‌తో పరిచయం ఉండటంతో హైదరాబాద్, బెంగళూరుకు డెడ్‌డ్రాప్ పద్ధతిలో సైప్లె చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన 1300 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
డెడ్‌డ్రాప్ పద్ధతిలో..!
వీరికి అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌తో సంబంధాలు ఉండడంతో తక్కువ ధరకు సింథటిక్ డ్రగ్స్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. గతంలో వీరు సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. కొనుగోలుదారుల నుంచి డబ్బులు ఖాతాలో పడగానే వారికి డ్రగ్స్ ఉంచిన ప్రాంతం ఫొటో, లొకేషన్ పంపిస్తారు. వారు వచ్చే వరకు ఎవరికి సైప్లె చేస్తామో, ఎవరికీ చెప్పకుండా ఉంటారు. దీనినే డెడ్‌డ్రాప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతినే సైప్లె జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.