హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు (వేప్‌లు) అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) టీం, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ముఖ్యంగా విద్యాసంస్థల సమీపంలో యువత, విద్యార్థులే లక్ష్యంగా ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందుకోసం ఎస్ఐడీ అనే పేరుతో ఒక ప్రత్యేక వాట్సప్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. సుమారు 500 మందికి వీరు ఈ నిషేధిత ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారని అధికారులు గుర్తించారు. నిందితులు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు. వీరికి ఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీం అనే వ్యక్తులు ప్రధాన సరఫరాదారులుగా వ్యవహరిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంతర్రాష్ట్ర నెట్ వర్ ద్వారా ఈ నిషేధిత ఉత్పత్తులను నగరానికి తెప్పించి ఇకడ విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ. 25 లక్షల విలువైన ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలు, వాటికి సంబంధించిన లిక్విడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్లు, విదేశీ కరెన్సీని సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ; ఏపీ లిక్కర్ స్కామ్‌లో పట్టుకున్న సిట్ అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజ్ కసిరెడ్డిని విజయవాడకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని ఆదేశించింది. కాగా, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. రాజ్ కసిరెడ్డి విజ్ఞప్తికి సమ్మతించలేదు. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది.