Forest Lands | ములుగు, అక్టోబర్ 20 (నమస్తేతెలంగాణ): భూముల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్న వేళ.. 40 వేలకే నాలుగు ఎకరాల భూమి అంటే ఆశ్చర్యపోతున్నారా? అటవీ భూముల పోడు పట్టాలను ఆసరాగా చేసుకుని ములుగు జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూదందా ఇది. ఏజెన్సీ గ్రామాల్లో 1/70 చట్టం అమలులో ఉండగానే పోడు పట్టాల పంపిణీ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నది. అదీ గిరిజనులకు కాదు.. గిరిజనేతరులకు పోడు పట్టాలు అందుతున్న తీరు ములుగు జిల్లాలో వెలుగు చూసింది.
ములుగు మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు చెందిన కొందరు రైతులు తమ పేరుపై నాలుగు ఎకరాల చొప్పున పోడు భూముల పట్టాలు పొందినట్టు తెలిసింది. పట్టాలు పొందిన రైతులు జంగాలపల్లి యూనియన్ బ్యాంకులో సంప్రదించి తమకు రుణాలను మంజూరు చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం గిరిజనులకే పోడు పట్టాలు రావాలి. కానీ గిరిజనేతరులకు పోడు పట్టాలు రావడం ఏమిటని సందేహం వచ్చిన బ్యాంకు మేనేజర్ పట్టాలను తీసుకెళ్లిన వారిని మందలించినట్టు తెలిసింది. దీంతో మూకుమ్మడిగా పట్టాలు పొందిన వారంతా ములుగు జిల్లా కేంద్రంలోని మరో బ్యాంకుకు వెళ్లి రుణాలు పొందుతున్నట్టు సమాచారం. సదరు బ్యాంకు మేనేజర్ నాలుగు ఎకరాల భూమికి రూ.లక్షా 30 వేల చొప్పున వ్యవసాయ రుణాలు మంజూరు చేసి, ఇన్సూరెన్స్ కింద రూ.30 వేల చొప్పున కట్ చేస్తున్నట్టు తెలిసింది. పట్టా వచ్చిన భూమి ఎక్కడ ఉందో తెలియని సంబంధిత వ్యక్తులు వచ్చిన రుణం ఇంతకు ఇంత నయం అనుకొని బ్యాంకు మేనేజర్ చెప్పిన దానికి ఒప్పుకొని ఇచ్చిన రుణాలను తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం రుణాలు పొందిన వ్యక్తులు మరికొందరికి సైతం పట్టాలు అందిస్తామని చెప్పి గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి డబ్బులను వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పోడు పట్టాల అక్రమ జారీ దందా వెలుగులోకి రానున్నది.
వరంగల్, హైదరాబాద్ కేంద్రంగా కొందరు మధ్యవర్తులు ముఠాగా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నారు. పాత తేదీల ప్రకారం పాస్ పుస్తకాలను గిరిజనేతరులకు గుట్టుచప్పుడు కాకుండా పట్టాలను చేయించి ఇస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా నాలుగు ఎకరాల భూమిని రూ.40 వేల చొప్పున చెల్లించి హైదరాబాద్ కేంద్రంగా పట్టాలు చేయించుకుంటున్నట్టు ఆయా గ్రామాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ పట్టాలు పొందిన గిరిజనేతరులు బ్యాంకుల్లో రుణాలు కూడా పొందుతున్నారు.