హైదరాబాదు : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పరడ గ్రామ పరిసరాల్లో కాకతీయుల కాలం నాటి అతి చిన్న గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, చరిత్ర పరిశోధకుడు రాగి మురళి తెలిపారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఇచ్చిన సమాచారం మేరకు పరడగుట్ట మీద గల కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, కొండ దిగువ తూర్పు వైపున గల బౌద్ధస్థూప శిథిలాలను పరిశీలిస్తుండగా, 4.0 సెం.మీ. ఎత్తు, 3.0 సెం.మీ. వెడల్పు, 2.0 సెం.మీ.ల మందంతో గల చిన్న గణేశ శిల్పాన్ని గుర్తించామని వారు చెప్పారు. తలపైన కాకతీయశైలి జటామకుటం, ఏనుగుతల, వెడల్పాటి చెవులు, ఎడమవైపుకు తిరిగిన తొండం, రెండు చేతుల్లో దంతం, మోదకం, పెద్ద బొజ్జపైన నాగయజ్ఞపవీతం, లలితాసనంలో కూర్చొని ఉన్న గణేశుని పీఠంపైన చిన్న మూషిక (ఎలుక) వాహనం, చక్కటి ప్రతిమా లక్షణంతో ఉందని, క్రీ.శ.13వ శతాబ్దికి చెందిన ఈ శిల్పం, మెత్తటి రాతిలో చెక్కబడిరదని శివనాగిరెడ్డి తెలిపారు.
గతంలో కర్నూలు జిల్లా వీరాపురంలో క్రీ.శ.3వ శతాబ్దానికి చెందిన ఇదే పరిమాణంలో ఉన్న మట్టి గణేశుని బొమ్మ, రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో క్రీ.శ.5వ శతాబ్దానికి చెందిన గణేశుని రాతి శిల్పం బయటపడ్డాయని, కాకతీయుల కాలంనాటి ఇంత చిన్న గణేశుని బొమ్మ తెలంగాణాలో బయల్పడటం ఇదే తొలిసారని ఆయన అన్నారు. పరడ గుట్టకు తూర్పువైపున శాతవాహన, ఇక్ష్వాకుల కాలం నాటి పురాతన స్థలంలో మరిన్ని పరిశోధనలు జరిగితే, అనేక చారిత్రక అవశేషాలు బయల్పడే అవకాశముందని శివనాగిరెడ్డి, మురళి తెలియజేశారు.