Ganesh Immersion | ఆదిలాబాద్ : గణనాథుడి ఊరేగింపు అంటే.. భారీ వాహనం.. డీజే శబ్దాలు.. ఇది ఇప్పటి ట్రెండ్. కానీ ఒకప్పుడు మాత్రం.. ఎడ్ల బండ్లపై గణనాథులను ఊరేగించేవారు. ఊరంతా డప్పు దరువుల మోత మోగేది. సంప్రదాయబద్ధంగా కొలాట ప్రదర్శనలు నిర్వహిస్తూ.. గణనాథులను ఊరేగించి.. అనంతరం చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేసేవారు. అయితే నయా ట్రెండ్‌కు విరుద్ధంగా అంటే.. భారీ వాహనాలు, డీజే శబ్దాలకు వ్యతిరేకంగా.. ఎడ్ల బండిపై సంప్రదాయబద్ధంగా గణనాథుడిని ఊరేగించి నిమజ్జనం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణలో గణనాథుడు 11 రోజుల పాటు పూజలందుకున్నాడు. ఇవాళ సాయంత్రం ఆ లంబోదరుడిని నిమజ్జనం చేశారు. అయితే ఎడ్ల బండితో పాటు ఎడ్లను సుందరంగా అలంకరించారు. ఇక ఎడ్ల బండిపై గణనాథుడిని ఉంచి ఊరేగింపు చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావివ్వకుండా.. చందా నది వరకు ఎడ్ల బండిపైనే విఘ్నేశ్వరుడిని తరలించారు. అనంతరం చందా నదిలో గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఈ గణేశ్ నిమజ్జనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు సురేందర్, నితీష్ కుమార్, రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.