హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే గణేశ నిమజ్జన వ్యహారంపై చిట్టచివరి సమయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందంటూ వ్యక్తిగత హాదాలో న్యాయవాది ఎం వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ను కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
జ్వరం రావడం వల్ల ముందస్తుగా పిటిషన్ వేయలేకపోయానని పిటిషనర్ చెప్పడంతో.. చివరి క్షణాల్లో పిటిషన్ వేయడం సరికాదని, ఇది కోర్టుపై ఒత్తిడి తీసుకురావడం, బ్లాక్‌బెయిల్ చేయడం కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఇది ప్రజాహితంతో కూడిన వ్యవహారమని, దీనిపై తామే విచారణ చేస్తామని ప్రకటించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని తెలంగాణ గణేశ్ ముక్తి కళాకార్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ 9కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.