యాదగిరిగుట్ట, జూన్ 7 : అపర భగీరథుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టినవే గంధమల్ల జలాశయం, యాదాద్రి వైద్యకళాశాల అని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 16వ ప్యాకేజీలో లింక్ ప్రాజెక్టు టెయిల్ఎండ్లో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి సాగుజలాలు అందించాలన్న లక్ష్యంతో 2019 ఫిబ్రవరిలో 9.8 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల జలశయాన్ని ప్రతిపాదించారని గుర్తుచేశారు. భూసేకరణ సమస్యతో 4.2 టీఎంసీలకు కుదించడంతోపాటు గ్రామస్థుల కోరిక మేరకు రీడిజైన్ చేసి 1.41 టీఎంసీలకు కుందించి నిర్మాణానికి పరిపాలనా అనుమతులతోపాటు నిధులు మంజూరైనట్టు స్పష్టంచేశారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మహేందర్రెడ్డి మాట్లాడారు.
తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో జరిగిన రేవంత్ సభ కేసీఆర్ను తిట్టేందుకే పెట్టినట్టు ఉందని, ఆ సభతో నియోజకవర్గానికి ఒరిగిందేమీలేదని మండిపడ్డారు. గంధమల్ల ప్రాజెక్టును తామే నిర్మిస్తున్నామన్న సీఎం రేవంత్రెడ్డి మాటల్లో నిజంలేదని చెప్పారు. గంధమల్లకు సాగుజలాలు రావాలంటే మల్లన్నసాగర్ జలాశయమే ఏకైక మార్గమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే మల్లన్నసాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు మళ్లించేందుకు టన్నెల్ పనులను సైతం పూర్తిచేయగా, కొంతవరకు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండానే ప్రసంగాన్ని సాగించినట్టు పేర్కొన్నారు.
యాదగిరిగుట్టకు స్వామివారి పేరిట వైద్యకళాశాలను 2022 జూలై 6న మంజూరు చేస్తూ జీవో-85 విడుదల చేయడంతోపాటు 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో కళాశాల భవన నిర్మాణానికి రూ.183 కోట్ల నిధులు మంజూరుచేసినట్టు గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు తిరిగి శంకుస్థాపనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యాదగిరిగుట్ట దేవస్థాన విమానగోపురం స్వర్ణతాపడం పనులు గత ప్రభుత్వం చేపట్టడంతోపాటు 100 కిలోల బంగారాన్ని సమకూర్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరూ రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు.