కామారెడ్డి, జనవరి 21: బీఆర్ఎస్ పార్టీ గద్దెల జోలికొస్తే ఖబర్దార్ అని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పిలుపునివ్వడం బాధాకరమని అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణను కేసీఆర్ తన పాలనతో ప్రగతిబాట పట్టించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.