సుల్తాన్‌బజార్/గద్వాల, జూలై 5 : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆయన పార్టీ మారుతున్నారని నెల రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకోగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు.
ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ అధిష్ఠానంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ సరిత ఆధ్వర్యంలో గద్వాల నుంచి 500 మంది పార్టీ నేతలు గాంధీ భవన్‌కు చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి బండ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను హస్తం పార్టీలో చేర్చుకుంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలంతా ఇబ్బందులు పడతారని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.
ఓ వైపు నిరుద్యోగులు, విద్యార్థులు టీజీపీఎస్సీ వద్ద నిరసనలు తెలపటం, మరోవైపు గద్వాల ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ వద్ద నిరసన తెలపటంతో నాంపల్లి పరిసరాలలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించటంతో ఆ రహదారి పోలీసులతో నిండిపోయింది.