రవీంద్రభారతి, జనవరి 31: ప్రజావాగ్గేయకారుడు, తెలంగాణ గర్వించే బిడ్డ గద్దర్ అని, 50 ఏండ్లపాటు తన ఆట, పాట, మాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన పోరాటయోధుడు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. ప్రభుత్వం శుక్రవారం రవీంద్రభారతిలో గద్దర్ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. త్యాగానికి పోరాటానికి నిలువెత్తు ప్రతిరూపం గద్దర్ అని, తెలంగాణ సాంస్కృతిక సమాజానికి ఆయన విశేషమైన సేవలందించారని శ్లాఘించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలలో తన ఆట, పాటలతో చైతన్యాన్ని రగిలించారని చెప్పారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు ఊపిరిఅయ్యారని కొనియాడారు. ఆయన జీవితాంతం పీడితవర్గాల పక్షపాతిగానే ఉన్నారని అన్నారు. సినీ రంగంలో గద్దర్ పేరిట ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, మహేందర్రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, గద్దర్ భార్య విమల, కుమారుడు సూర్యం తదితరులు పాల్గొన్నారు.