హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశ సుస్థిరాభివృద్ధి-2030 లక్ష్యంలో చట్టసభలు క్రియాశీల పాత్ర పోషించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ సూచించారు. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన పదో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ)లో ‘సుస్థిరమైన అభివృద్ధిలో శాసన వ్యవస్థల పాత్ర’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలు సుస్థిరాభివృద్ధి కోసం ఉద్దేశించిన చట్టాలను, అవసరమైన నియమాలను రూపొందించడంతోపాటు వాటి అమలును వివిధ స్థాయిల్లో పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. పేదరికం, అసమానత్వం, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పులపై 2015లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన నియమాలు మన పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలకు మార్గదర్శకాలుగా ఉన్నాయని చెప్పారు.
గడ్కరీతో శాసనసభ స్పీకర్ భేటీ
స్పీకర్ ప్రసాద్‌కుమార్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలోని మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని, మరో ఏడు రోడ్లకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ కింద నిధులు మంజూరు చేయాలని గడ్కరీని కోరారు. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.