Congress | శేరిలింగంపల్లి, అక్టోబర్ 9: ఎన్నికల నగారా ఇలా మోగిందో.. లేదో ప్రతిపక్ష పార్టీలు అలా ఓటర్ల ప్రలోభాలకు రెడీ అయిపోయాయి. గోపన్‌పల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్యాదవ్కు చెందిన పలు ప్రెషర్ కుక్కర్లను గచ్చిబౌలి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఓటర్లకు పంచేందుకు గోపన్పల్లితండాలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కుక్కర్లు నిల్వ చేసినట్టు సమాచారం అందడంతో గచ్చిబౌలి పోలీసులు ఆ ఇంటిపై దాడిచేశారు. మొత్తం 87 కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్లను నిల్వచేసిన రాములునాయక్, నర్సింహను అరెస్ట్ చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న కుక్కర్ బాక్స్‌లపై ‘రఘునాథ్‌యాదవ్.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం’ అని ముద్రించి ఉండడంతోపాటు రఘునాథ్ ఫొటో కూడా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నగదు, బహుమతులు, వస్తువుల పంపిణీ రూపంలో ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని, అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్బాబుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.