బాంబులు నా మీద పడ్డయా? లేకుంటే ఆ రాసినోళ్ల మీద పడ్డయా? డెఫినెట్‌గా తేలుద్ది. నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తడు, ఏమిటి అనేది నిజం నిదానంగా, నిలకడ మీద తెలుస్తుంది. గ్లోబల్ సమ్మిట్ బ్రహ్మాండంగా జరుగబోతున్నది, దానికి కౌంటర్‌గా నాకు తోచింది, నాకు కలలోకి వచ్చింది, నా పేపర్ ఫ్రంట్ పేజీలో రాసుకుంటా.. అని అనుకున్నంత మాత్రాన నిజం మారిపోదు.నమస్తే తెలంగాణ’ను ఉద్దేశించి పరోక్షంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలివి.
హైదరాబాద్ /సిటీబ్యూరో/ మణికొండ, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ’ అనే పతాక శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి బుకాయింపు సమ సమాధానమిచ్చారు. ‘దీపావళి కంటే ముందే రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలుతాయి’ అంటూ మంత్రి కొరియా పర్యటనలో చెప్పినంత సులువుగా ‘నమస్తే తెలంగాణ ఒకరి మీద బురద చల్లే రాతలు రాయదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయిన ఈ కథనంలో పొంగులేటి పేరు ఎక్కడా రాయకపోయినా భుజాలు తుడుముకొని తనకుతానే బయటపడ్డారు. ఇంతదూరం వచ్చాక ముంత దాయటం ఎందుకు? ప్రజలు ఒక విశ్వాసంతో ఇచ్చిన రాజ్యాధికారాన్ని కాంట్రాక్టులు, కబ్జా కోసం తాకట్టు పెడతామంటే కండ్లు మూసుకోడానికి ‘నమస్తే’ సరారుకు అమ్ముడుపోయి సంకకెక్కిన రొచ్చు మీడియా కాదు. పక్కా ఆధారాలను సేకరించి నిజాలు నిరూపణ అయిన కఠోర వాస్తవాలనే కుదిగుచ్చి ప్రజల ముందు, పాఠకుల ముందు పెట్టింది. ఇంతకంటే భయంకరమైన నిజాలు నమస్తే తెలంగాణ వద్ద ఉన్నాయి. కానీ కుటుంబ విలువలను గౌరవించి కొందరి పేర్లను గోప్యంగా ఉంచటం జరిగింది.
రాఘవ కన్స్ట్రక్షన్ మీద భూ ఆక్రమణ కేసు
భూకబ్జా వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఉన్నదని, తమ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వ్యక్తులు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ పేరే చెప్పారని పల్లవీషా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సమయానికి బౌన్సర్ల అరాచకం కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తున్నది. అదే గ్రౌండ్లో పోలీసులు బౌన్సర్లను నిలువరించి, వారిని తరిమివేసినట్టు సమాచారం. వాస్తవ పరిస్థితిని కండ్లతో చూసిన పోలీసులు, పల్లవీషా ఇచ్చిన ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించారు. రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్‌తోపాటు మరికొందరి మీద 329(3), 118(1), 324(4), 304(2), 127(2), 351(2) r/w 3(5)సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు నిజం నిప్పులా వ్యాప్తి చెంది రా ష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంటే మంత్రి గారు, నమస్తే తెలంగాణను నిందిస్తూ నిజం నిలకడ మీద తెలుస్తుందని బుకాయించటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం
చేస్తున్నారు.
మాకు ప్రాణహాని ఉంది: పల్లవీషా
తమ పూర్వీకులకు చెందిన భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి చెందిన వ్యక్తులే దౌర్జన్యాలకు పాల్పడుతూ, మంత్రి బలంతో తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సతీశ్‌షా కుమార్తె పల్లవీషా ఆరోపిస్తున్నారు. తమ మధ్య కుటుంబ తగాదాలు ఉన్నాయని తెలిపారు. తమ భూమిని దక్కించుకోవడానికి అధికారపార్టీ బలంతో కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారు కొనుగోలు చేసిన సర్వేనంబర్‌లో తక్కువగా ఉన్న భూమిని తమ భూమిలో చూపించి ఆక్రమించుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. అధికారపార్టీ నేతలతో తమకు ప్రాణహాని ఉన్నదని అన్నారు.
అసలేం జరిగింది..
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం, వట్టినాగులపల్లి గ్రామంలో సర్వే నం.245/19లో సతీశ్‌షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. అది గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్న లేక్‌వ్యూ పాయింట్ బిట్టు. ఈ స్థలంలోకి తొలుత అక్టోబర్ 25న రాత్రి 11గంటల సమయంలో చొచ్చుకువచ్చిన దుండగులు ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. తిరిగి నవంబర్ 30న దాదాపు 70 మంది బౌన్సర్లు ట్రక్కులు, రిజిస్ట్రేషన్ నంబర్ లేని నాలుగు బుల్డోజర్లతో విరుచుకపడి ప్రహరీగోడను, ఆ స్థలంలో ఉన్న గోశాలను కూల్చివేశారు. అడ్డం వచ్చిన వారిని చితకబాదారు. సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెంట్‌ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. గోశాలలో ఉన్న ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేసి, సిబ్బంది సెల్ఫోన్లను లాక్కెళ్లారు. ఇదే విషయం సతీశ్ షా కుమార్తె పల్లవీషా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.