హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టయిన గాదె ఇన్నయ్య అలియాస్ గాదె ఇన్నారెడ్డికి ఎన్ఐఏ కోర్టు పెరోల్ మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల నిమిత్తం 48 గంటల పెరోల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జనగాం జిల్లా జాఫర్గడ్ మండలం సంగారంలో ఇన్నయ్య మాతృమూర్తి గురువారం మృతి చెందారు. ఆమె అంత్యక్రియల కోసం తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఇన్నయ్య పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు, నాలుగో అదనపు సెషన్స్ జడ్జి జే విక్రమ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రామవరం చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనల అనంతరం తల్లి అంత్యక్రియలకు మానవీయ కోణంలో 48 గంటల అత్యవసర పెరోల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. రాష్ట్ర పోలీసులు, జైలు అధికారుల సహకారంతో పిటిషనర్ ఇన్నయ్య తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్ఐఏ ఇన్స్పెక్టర్కు కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తగిన నిఘా పెట్టాలని రాష్ట్ర పోలీసులకు సూచించింది. 48 గంటల గడువు ముగియగానే రక్షణ నిమిత్తం అవసరమైతే, పిటిషనర్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఉంచవచ్చునని పేర్కొన్నది. 48 గంటల తర్వాత పిటిషనర్‌ను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ ఎదుట హాజరుపర్చాలని పోలీస్ ఎసార్ట్ను ఆదేశించింది.
తల్లి అంత్యక్రియల సందర్భంగా బయటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహించరాదని, కేవలం తండ్రి, భార్య, పిల్లలు, సొంత సోదరులనే పిటిషనర్ కలువాలని షరతు విధించింది. మొబైల్ ఫోన్ వినియోగించరాదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవద్దని ఆదేశించింది. సామాజిక మాధ్యమాలతో సహా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వరాదని చెప్పింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయరాదని హెచ్చరించింది. తొలుత గాదె ఇన్నయ్య పెరోల్ నిమిత్తం అతడి తరఫు న్యాయవాది రాయవరం చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలుకు ప్రయత్నించారు. ఈ పిటిషన్‌ను సంబంధిత ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసుకోవాలని రిజిస్ట్రీ పేరొన్నది.