హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సీనియర్ కెమిస్ట్‌గా నాలుగేండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న జీ వెంకటేశ్ ఈనెల 6న తన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం జగన్నాథపురం గ్రామానికి వెళ్లాల్సి ఉన్నది. అతను వస్తే ఆ రోజు పెండ్లిచూపులకు వెళ్లాలని తామంతా ఎదురుచూసినట్టు అతని కుటుంబసభ్యులు తెలిపారు. అనూహ్యంగా ఉదయం ఆరు గంటల షిఫ్ట్ విధులకు వెళ్లిన వెంకటేశ్ ప్రమాదంలో చనిపోయినట్టు తమకు సోమవారం ఉదయం 10 గంటలకు తెలిసిందని బాధితులు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు.
కంపెనీ ఇచ్చిన గెస్ట్‌హౌస్‌లో చందానగర్‌లోనే ఉంటున్న శ్రీనివాస్‌కు ఇంకా పెండ్లికాలేదని, 6న తాను ఇంటికి వస్తున్నానని, ఆ రోజు పెండ్లిచూపులకు వెళ్దామని చెప్పినట్టు తెలిపారు. ఇంతలోనే ప్రమాదానికి గురై తమ బిడ్డ చనిపోతాడని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉదయం డ్యూటీకి వెళ్తున్నట్టు ఫొటో షేర్ చేశాడని, డ్రెస్ ఆధారంగా అతని బాడీకి చెందిన శరీర భాగాలను గుర్తించి తీసుకొని వెళ్తున్నామని కుటుంబసభ్యులు తెలిపారు. అతని అస్థికలనైనా గంగలో కలిపితే ఆత్మశాంతిస్తుందేమోనని తీసుకెళ్తున్నామని అతని తండ్రి చెప్పిన తీరు ఇతరులకూ కన్నీరు పెట్టించింది.