హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌గా హనుమకొండ జిల్లా ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ఆవరణలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి మహిళా సర్పంచ్ల సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సామాజికంగా వెనుకబడిన ఎంబీసీ, సంచార జాతుల నేపథ్యం ఉన్న రేణుకను కన్వీనర్‌గా ఎన్నుకోవడంపై మహిళా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ సర్పంచ్‌గా రేణుక భారీ మెజారిటీతో గెలుపొందారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,703 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 శాతం (6,403 స్థానాలు) మహిళలకే దక్కిన నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో రేణుక కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామాల్లో మహిళా సర్పంచ్ల ప్రాధాన్యత పెంచడం, వారి సాధికారత కోసం ప్రభుత్వం చొరవ తీసుకునేలా చూడడం, పంచాయతీలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు నేరుగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేయడం, మహిళా సర్పంచ్ల వేతనాలు పెంచేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం సర్పంచ్ల ఫోరం ప్రధాన లక్ష్యాలు. మండల, జిల్లా కమిటీల ఎన్నిక అనంతరం హైదరాబాద్‌లో రాష్ట్ర మహిళా సర్పంచ్ల ఫోరం పూర్తిస్థాయి కమిటీని ఎన్నిక ఉంటుంది.
ఈలోగా మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేస్తుంది. పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ ప్రకటన వరకు రేణుక కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి మహిళా సర్పంచ్‌లను ఏకంచేసి జిల్లా కమిటీలను, రాష్ట్ర కమిటీని అధికారికంగా నియమిస్తామని, ఇదే క్రమంలో సమస్యలపై చర్చించి పోరాడుతామని గుంటిపల్లి రేణుక తెలిపారు. గ్రామ పంచాయతీలు ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు నేరుగా నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో మహిళా సర్పంచ్ల సాధికారత కోసం ప్రభుత్వం చొరవ తీసుకునే విధంగా, మహిళా సర్పంచ్ల వేతనం పెంచేవిధం గా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయ త్నం చేస్తామని రేణుక పేర్కొన్నారు.