హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఉద్యమంతోపాటు తెలంగాణ స్వయంపాలనలో యువత పాత్ర గొప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో యువత పాత్ర అన్నిరంగాల్లో కీలకం కాబోతున్నదని, భవిష్యత్తు వారిదేనని తెలిపారు. గురువారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతో విద్యార్థి యువ నేతలకు రాజకీయ, పాలనారంగాలు, చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించామని, దీనిద్వారా బడుగు బలహీనవర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మున్ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీవంటి రంగాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఉపాధికి అవకాశం ఉన్న టూరిజం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నదని తెలిపారు. స్వయం ఉపాధి కోసం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమల్లోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామని తెలిపారు. వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.