హైదరాబాద్ సిటీబ్యూరో/షాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో బెయిల్ పొంది యథేచ్ఛగా తిరుగుతున్న ఓ నిందితుడు పగబట్టి చేసిన ఘాతుకం కలకలం రేపింది. రెండు గంటల్లో ఏకంగా ఆరుగురిని హతమార్చడం రాజధాని శివారులోని షాబాద్‌ను కుదిపేసింది. కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబాన్ని, ప్రశ్నించిన తన కుటుంబాన్ని సైతం ఆ ఉన్మాది గొంతులు కోసి హతమార్చడం శనివారం రాష్ర్టాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామానికి చెందిన పార్వతి రాజ్‌కుమార్(28) స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. అతనికి షాబాద్‌లోని పీఆర్ఆర్ స్టేడియంసమీపంలో ఇల్లు ఉన్నది. ఆ ఇంటి పక్కనే చిట్యాల లక్ష్మి(45), ఆమె అత్త రుక్కమ్మ(65), కూతుళ్లు బాలిక(17), మేఘన(దివ్యాంగురాలు)తో కలిసి నివాసముంటున్నది. లక్ష్మి భర్త మల్లేశ్ గతేడాది మృతి చెందాడు. ఆమె కూతురు శంషాబాద్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది.
ఈ బాలికనే ఏడాది కాలంగా రాజ్‌కుమార్ వేధిస్తున్నాడు. తన ఇంటికి సీసీ కెమెరాలు పెట్టి, బాలిక ఇంటి వైపు ఫోకస్ చేశాడు. బాలిక ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే ఆమెను వెంబడిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ ఏడాది మే 16న ఇంటర్ పరీక్ష ఉండటంతో లక్ష్మి, తన కూతురుని తీసుకొని శంషాబాద్‌కు వెళ్లింది. ఈ క్రమంలో రాజ్‌కుమార్ అక్కడికి చేరుకొని బాలికను తనతో బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న తల్లి కూతురుని తీసుకెళ్లి షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును పోలీసులు పక్కన పెట్టేశారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. నిందితుడు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందేందుకు పరోక్షంగా సహకరించారు. రాజ్‌కుమార్ జూన్ 12వ తేదీన ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. ఆ తరువాత షాబాద్ ప్రాంతంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ
శనివారం తెల్లవారుజామునే ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపినట్టు వెల్లడించారు. అయితే పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ స్థానికులు రాస్తారోకోకు దిగడంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం వరకు స్థానికులు ఆందోళనను విరమించలేదు. దీంతో షాబాద్ ఎస్సై రమేశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఇన్స్పెక్టర్ కాంతిరెడ్డిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇదిలా ఉండగా నిందితుడు రాజ్‌కుమార్ శనివారం సాయంత్రం వరకు కూడా దొరకకపోవడంతో, నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షలు ఇస్తామని రివార్డును ప్రకటించారు.
అనాథగా మారిన మేఘన
రాజ్‌కుమార్ ఘాతుకంతో బాధిత కుటుంబంలో దివ్యాంగురాలు మేఘన మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమె అంగవైకల్యంతో పాటు బుద్ధిమాంద్యంతో ఇంట్లోనే ఉంటున్నది. అన్ని పనులు తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మ చేసి పెట్టేవారు. తల్లి, నానమ్మను రాజ్‌కుమార్ హతమార్చి, చెల్లిని తీసుకెళ్తున్నా నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయింది. ఇక అందరి మరణంతో అనాథగా మారింది.
ప్రాణహాని ఉందన్నా పోలీసులు పట్టించుకోలే
రాజ్‌కుమార్‌పై కేసు పెట్టినప్పుడు పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు ఇంతమంది చనిపోయారు. అతడు బయట దర్జాగా తిరుగుతుంటే మేము పోలీసుల దగ్గరికెళ్లి పలుమార్లు చెప్పినా నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఎస్సై రమేశ్, సీఐ కాంతారెడ్డి ఈ కేసు విషయంలో సరిగ్గా చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు మా వాళ్లు చనిపోయి ఉండేవాళ్లు కాదు. అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని చెప్తే, బెయిల్ తెచ్చుకున్నాడు ఏం కాదులే అని మమ్మల్ని చులకన చేసి మాట్లాడారు. ఎస్సై, సీఐపై చర్యలు తీసుకోవాలి.
-నరేశ్, బాలిక మేనమామ
సీఎం, ఎమ్మెల్యేకు కనిపించడం లేదా?
షాబాద్‌లో ఆరుగురు హత్యకు గురైతే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా..? తమిళనాడులో ఏదైనా చిన్న ఘటన జరిగితే అక్కడి సీఎం వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. తెలంగాణ సీఎం ఎందుకు రెస్పాండ్ అయితలేడు. ఎమ్మెల్యే పట్టించుకోలేదు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తే ఊరుకోం. రాత్రికి రాత్రే అనాథ శవాల మాదిరిగా, పంచానామా చేయకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మృతదేహాలను దవఖానకు ఎలా తీసుకెళ్తారు? బంధువులం వచ్చే వరకు కూడా ఉంచలేదు. నిందితుడిని పట్టుకునేంత వరకు పోరాటం చేస్తాం.
-కిరణ్, బంధువు
న్యాయం జరిగేలా చూస్తాం: కలెక్టర్

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. షాబాద్‌లో ధర్నా చేస్తున్న వారితో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఎస్సైని సస్పెండ్ చేశామని, సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబంలో దివ్యాంగురాలైన యువతికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేయగా, రూ.5లక్షలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతోపాటు ఆమెకు ఇల్లు లేకుంటే ఇంటిని కట్టించి ఇస్తామని తెలిపారు. ఆమె ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం తరపున నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ సెంటర్లో జాయిన్ చేసి ప్రభుత్వమే అన్ని చూసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఆరు కాదు ..ఏడు హత్యలు..?
నిందితుడు రాజ్‌కుమార్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉన్నదని పోలీసులు వెల్లడించారు. బాలిక తండ్రిని కూడా పథకం ప్రకారం హత్య చేసి, గుండెపోటుగా చిత్రీకరించాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఆరు హత్యలు కాదు.. ఏడు హత్యలు చేశాడంటూ బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. రాజ్‌కుమార్‌కు ఇంటి పక్కనే ఉండే బాలిక తల్లిదండ్రులు మల్లేశ్, లక్ష్మిలతో పరిచయమున్నది. ఈ నేపథ్యంలోనే గతేడాది పథకం ప్రకారం మల్లేశ్‌కు మద్యం తాగించి ఇంటి వద్ద దింపేసి వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే రోజు ఆయన మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్టుగా అంతా భావించారు. కొంతకాలంగా బాలిక వెంటపడుతూ మీ నాన్నను చంపినట్టే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు కూడా చెప్పారు. అయినా పోలీసులు ఈ విషయంపై ఏ మాత్రం దృష్టి సారించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలో ఒక కేసు నమోదయ్యిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.
పగతో రగిలి.. ఆరుగురిని కడతేర్చి