KCR | హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘జీవితంలో కష్ట సుఖాలు సహజమే. కొంతకాలంగా రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనున్నది. 2028లో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే’ అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జోస్యం చెప్పారు. ప్రస్తుతం రాహుకాలం కొనసాగుతున్న ఆయనకు త్వరలోనే శుభ గడియలు ప్రారంభం కానున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. పరిస్థితులు కలిసివచ్చి కేసీఆర్‌కు రాజయోగం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రశాంత్ కిని చెప్పిన జోస్యం అనేక సందర్భాల్లో నిజమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, జగన్ రాజకీయ భవిష్యత్తు, సినీ, వ్యాపార రంగాల్లోని సుప్రసిద్ధ వ్యక్తుల గురించి చెప్పిన అంచనాలు వాస్తవమయ్యాయి. ఆయనకు ఎక్స్‌లో 52 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కిని ఎక్స్‌లో కేసీఆర్‌పై చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నది. వేలాదిమంది నెటిజన్లు ఇది ముమ్మాటికీ కరెక్టేనని కామెంట్ చేస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలుచేయాలి ; 25 నుంచి మాదిగల ధర్మయుద్ధ మహాసభలు
హైదరాబాద్, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణను వెంట నే అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 25 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో మాదిగల ధర్మయుద్ధ మహాసభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నేతలు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్గీకరణ లేకుండా టీచర్ పోస్టులను భర్తీ చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాదిగలకు ద్రోహం చేసిందని పేర్కొన్నారు. గ్రూప్-2, 3, 4, ఇతర ఉద్యోగాలు డిసెంబర్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, ఇది మాదిగజాతిని అణగదొక్కే చర్య అని, దీనిని మాదిగలంతా ఎదురోవాలని పిలుపునిచ్చారు.