హైదరాబాద్ : శాసనసభలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటనపై అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలె తెలిపారు. అనతంరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర సాధనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్ఎస్ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
నూతన ఉద్యోగ నియామకాలతో మరింత సర్వతోముఖాభివృద్ధి వైపు రాష్ట్రం సాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం కానుందని తెలిపారు. కరోనా లాంటి కష్టకాలంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు సీఎం ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసిందని అన్నారు.
ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. అంతే కాకుండా ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించడం సీయం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం స్పష్టం చేశారు. సీయం కేసీఆర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాపురావు, తదితరులు ఉన్నారు.