హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ పారిశుద్ధ్య కార్మికులపై ప్రభుత్వం ఎట్టకేలకు కనికరం చూపిం ది. బీఆర్ఎస్ అనేక పోరాటాలు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు, సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లే ఖల పర్యవసానంతో వారి వేతనాలకు అవసరమైన నిధులను విడుదల చేసింది. సో మవారం జీపీలకు రూ.150 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని 29,676 మంది పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను చెల్లించాలని సూచించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదు.
దీంతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. దీంతో వారు గ్రామ పంచాయతీ, కలెక్టరేట్ల ముందు ఆందోళన చేశారు. బిక్షాటన చేశారు. ఈ సమస్యలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ బహిరంగ లేఖ రాసింది. పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావాన్ని ప్రకటించి, ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మే వరకు వేతనాలను చెల్లించేలా నిధులను విడుదల చేసింది. అయితే ట్రాక్టర్ నిర్వహణ, ఇతర పనులకు నిధులు విడుదల చేయలేదు.